14 July, 2026 | 11:22 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కీసరలో దారుణం

08-01-2026 12:38 PM

దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి

​పాల బకాయిల గొడవతో కిరాతకానికి ఒడిగట్టిన వ్యాపారి

​మేనేజర్ శ్రీనివాస్ పరిస్థితి విషమం

​నిందితుడు కిరణ్ కోసం పోలీసుల గాలింపు

కీసర,(విజయక్రాంతి): కీసర ప్రధాన కూడలిలో గురువారం తెల్లవారుజామున ఒక పాల వ్యాపారి ఘాతుకానికి పాల్పడ్డాడు. పాత బకాయిల వసూళ్ల విషయంలో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసేవరకు వెళ్లింది. ఈ దాడిలో మేనేజర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

​అసలేం జరిగింది?

​పోలీసుల కథనం ప్రకారం.. మౌలాలికి చెందిన శ్రీనివాస్ తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కీసర ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి కిరణ్ గత కొంతకాలంగా దొడ్ల కంపెనీకి పాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల విషయమై గతంలోనే వీరిద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో, గురువారం తెల్లవారుజామున శ్రీనివాస్ తన హుండాయ్ ఐ 20 కారులో (TS 08 EP 7851) కీసర ప్రధాన కూడలికి చేరుకున్నారు.

​బకాయిలు చెల్లించనందున కిరణ్‌కు ఇకపై పాలు సరఫరా చేయవద్దని శ్రీనివాస్ మిల్క్ వ్యాన్ డ్రైవర్‌కు సూచించారు. దీనితో ఆగ్రహానికి గురైన కిరణ్, శ్రీనివాస్‌తో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో కిరణ్ తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయారు.

​చికిత్స.. పోలీసుల దర్యాప్తు

​సమాచారం అందుకున్న కీసర పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్‌ను చికిత్స  నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు కిరణ్ ఘటన అనంతరం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలోని సీసీ టీవీ ఫుటేజీలను  పరిశీలిస్తున్నారు.