అనురాగ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి అరుణ్ కుమార్ కు డాక్టరేట్ ప్రధానం
ఘట్ కేసర్, జూన్ 19 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి అరుణ్ కుమార్ పోలే పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎల్‌సీ-ఎమ్‌ఎస్/ఎమ్‌ఎస్ విశ్లేషణ ఇన్-సిలికో విషతుల్యత అంచనాల ద్వారా కొత్తగా ఆమోదించబడిన యాంటీ-ట్యూబర్‌క్యులర్ ఔషధాలు, వాటి కలయికల ఫోర్స్డ్ డీగ్రడేషన్ ఉత్పత్తుల గుర్తింపు, వేరు చేయడం, లక్షణ నిర్ధారణ అనే అంశంపై నిర్వహించిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది.
ఈ పరిశోధనను ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ గంగారపు కిరణ్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. పరిశోధనలో కొత్తగా ఆమోదించబడిన క్షయవ్యాధి నిరోధక ఔషధాలు, వాటి కలయికలు వివిధ పరిస్థితుల్లో విచ్ఛిన్నమయ్యే సమయంలో ఏర్పడే ఉప ఉత్పత్తులను గుర్తించడం, వాటిని వేరు చేయడం వాటి రసాయన లక్షణాలను నిర్ధారించడం వంటి అంశాలను ఎల్‌సీ-ఎమ్‌ఎస్/ఎమ్‌ఎస్ సాంకేతికత ద్వారా విశ్లేషించారు. అదనంగా ఆఉప ఉత్పత్తుల వల్ల కలిగే సంభావ్య విషతుల్యతను కంప్యూటర్ ఆధారిత ఇన్-సిలికో పద్ధతుల ద్వారా అంచనా వేశారు.
ఈసందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చనా మంత్రీ, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ముత్తారెడ్డి, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డాక్టర్ సతీష్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికందర్ బాబా, స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ బక్షి, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అరుణ్ కుమార్ పోలేను అభినందించారు.






