7 June, 2026 | 1:24 AM

గ్రామాలను, రైతులను నాశనం చేయొద్దు

07-06-2026 12:00 AM
  1. ఫ్యూచర్ సిటీ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు 
  2. టీఆర్‌ఎల్‌డీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్

ఖైరతాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్‘పై శనివారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ (టీఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ చర్చా వేదికలో పలువురు రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ సిద్ధాంతమైన ‘గ్రామీణ వికాస్ - దేశ్ కా వికాస్‘ను గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులను, గ్రామాలను నాశనం చేయవద్దని, భూములు కోల్పోయే రైతులకు తగిన నష్టపరిహారంతో పాటు ఉపాధి, నివాస అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నాయకుడు, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజుల ఆచారి మాట్లాడుతూ.. గతంలో మహబూబ్‌గర్ జిల్లాలో ఫార్మా సిటీ, ఏఐ జోన్ వంటి పలు ప్రాజెక్టుల కోసం సుమారు 50 వేల ఎకరాలు సేకరించినా, అందులో 10 శాతం కూడా అభివృద్ధి కాలేదని, రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ కూడా కేవలం భూసేకరణకే పరిమితం కాకుండా ప్రభుత్వం సమగ్ర పరిష్కారం చూపాలని కోరారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ స్వయం సమృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి ప్రతీకగా ఉండాలని, చండీగడ్, శాన్ ఫ్రాన్సిస్కో, రోమ్ వంటి నగరాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి హన్మేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలితాలు కేవలం 15 శాతం మందికే కాకుండా, నిర్లక్ష్యానికి గురవుతున్న 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

ఆర్థికవేత్త ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కోల్కతా, చెన్నై వంటి నగరాలు క్షీణిస్తున్నాయని, హైదరాబాద్‌లో సేవారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యవసాయ ప్రొఫెసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. జిటానియం టెక్నాలజీస్ ప్రతినిధులు శ్రీ సుమైర్, శ్రీ రాజేష్ ఈ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

లైబ్రరీస్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన సానుకూల, ప్రతికూల సూచనలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, సమావేశ అధ్యక్షుడు వీవీఎస్ బంధా కవి మాట్లాడుతూ.. మేధావుల నుంచి సేకరించిన ఈ అభిప్రాయాల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి, అధికారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎల్‌డి యువజన అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి గౌర బీరప్ప, ప్రధాన కార్యదర్శులు విశాల్ వంజారి, రిషబ్ జైస్, నరసింహారావు, కోశాధికారి గిరి కుందే, కార్యదర్శి ఓంకార్ గౌడ్ పాల్గొన్నారు.