భూ రీ-సర్వేలో తప్పిదాలు చేయవద్దు
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నాగల్‌గిద్ద, ఆగస్టు 27: నాగల్గిద్ద మండల పరిధిలోని కరస్గుత్తి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర ప్రక్రియలను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డులను పక్కాగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, సర్వే ల్యాండ్ ఏడీ, నాగల్గిద్ద తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, ఎంపీడీవో మహేశ్వర రావు ఆర్‌ఐ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీ-సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.






