జిన్నారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
జిన్నారం/ అమీన్ పూర్, జూలై 16: వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లను సందర్శించారు. ఈ సందర్భంగా జిన్నారం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పటాన్చెరువు డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బందికి అందజేసిన కిట్ ఆర్టికల్స్ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనపరచుకున్న, కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకొని, క్రైమ్ సంబంధించిన వాహనాలను సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయాలని, అన్క్లెయిమ్డ్ వాహనాలను బహిరంగ వేలం ద్వారా డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ, యువ కానిస్టేబుళ్లు అన్ని రకాల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని, భవిష్యత్తులో స్టేషన్ రైటర్లుగా ఎదగాలని సూచించారు.జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, విధుల నిర్వహణలో మరింత కష్టపడి పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట పటాన్చెరువు డీఎస్పీ ప్రభాకర్, జిన్నారం సీఐ పి. రమణారెడ్డి, ఎస్హెచ్‌ఓ హనుమంతు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.






