15-02-2026 06:35:44 PM
గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేత
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా మండల విద్యాశాఖ అధికారి ఆరెపల్లి రాజయ్య, పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ సుల్తానాబాద్ మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ ప్రణయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని అన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఈ పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ, ఇక్బాల్, అబ్దుల్ , రజాక్,విద్యార్థులు పాల్గొన్నారు.