16 April, 2026 | 7:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి

16-04-2026 04:40 PM

గ్రామ, మండల స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమాలు విజయవంతంగా అమలు

స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసి సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలి

కూసుమంచి,(విజయక్రాంతి): జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణతో గ్రామాలలో సమగ్ర మార్పు తీసుకురావాలని  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి ప్రతిష్టాత్మకంగా 99 రోజుల “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 2న గ్రామ స్థాయి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా మండల కేంద్రాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇటీవల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్సాహంతో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.

గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉన్న సమస్యలను స్థానిక నాయకత్వంతోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పరిష్కరించాలని, ముఖ్యంగా శానిటేషన్, వీధి దీపాల నిర్వహణ, మల్టీ పర్పస్ వర్కర్లకు సమయానికి వేతనాల చెల్లింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయగా, ఖమ్మం జిల్లాకు సుమారు 16 వేల 500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో 2800 ఇళ్లు పూర్తయ్యాయని, 8200 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, తొందరలోనే సుమారు 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతాయని చెప్పారు. కూసుమంచి మండలంలో 690 ఇళ్లు మంజూరు కాగా, ఇంకా ప్రారంభం కాని 43 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా సర్పంచులు, స్థానిక నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

కూసుమంచి మండలంలో కొత్త జూనియర్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలకు పునాది పడిందని, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, 500 గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, క్వింటాల్‌కు 500 బోనస్, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూసుమంచి మండలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్, కూసుమంచి మండల ఇన్చార్జి ఎంపీడీవో రాజారావు, తహసీల్దార్ సైదులు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాణి, హెచ్ ఓ అపర్ణ, ఎంఈఓ వీరస్వామి, ఐసిడిఎస్ ఉమా,  వైద్యాధికారి డాక్టర్ సాయి, వెటర్నరీ డాక్టర్ నీలకంఠం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.