వరి సాగు తగ్గించి... ఆరుతడి, కూరగాయల పంటలపై దృష్టి పెట్టాలి
గుంజలూరులో కంది, కూరగాయల పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి
చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి బుధవారం కంది, కూరగాయల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకుని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన సాగు విధానాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని సూచించారు.
తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే ఆరుతడి పంటలు అయిన కంది, పెసర, మినుములు, జొన్నలు, చిరుధాన్యాలతో పాటు కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభదాయకమైన వ్యవసాయం చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా రైతులు తమ వద్ద అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేసుకుని, వాటికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. నీటి కొరత వల్ల పంటలు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వినియోగంలో పొదుపు పద్ధతులు పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.






