పోతుగల్‌లో 1874 రేషన్ కార్డుల పంపిణీ
ముస్తాబాద్,ఆగస్టు 20( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో 1874 మంది లబ్ధిదారులకు గురువారం సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిగారి శ్రీనివాస్,రాజిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పారదర్శకమైన సేవల కోసమే ప్రభుత్వం కార్డులు అందిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని, అన్ని వర్గాల ప్రజల కు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంగ రాజు,ఆది శేఖర్, గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అనమేని రాజు, ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






