21 August, 2026 | 1:13 AM

విధుల నుంచి సీఐ రఘుపతిరెడ్డి తొలగింపు

21-08-2026 12:29 AM
  1. విద్యార్థుల గొంతు నులిపిన ఘటనపై స్పందించిన ఎస్పీ 
  2. ఘటనపై డీఎస్పీతో సమగ్ర విచారణకు ఆదేశం 

మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సంద ర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్ పట్టణ సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పిసికిన ఘటన పై జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్పందించారు. ఈ సంఘటనపై డీఎస్పీ స్థాయి అధికారి చేత సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే విచారణ పూర్తయ్యేంతవరకు సీఐ రఘుపతి రెడ్డిని తాత్కాలికంగా విధుల నుంచి దూరం పెట్టినట్లు ఎస్పీ గురువారం ప్రకటించారు.

మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పాలిటెక్ని విద్యార్థులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులను అడ్డుకోవడానికి సీఐ ఏకంగా విద్యార్థుల గొంతు పిసికిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం, గురువారం పత్రికల్లో ప్రధాన శీర్షికతో ప్రచురితం కావడంతో పాటు విద్యార్థి, వివిధ ప్ర జా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేయడంతో రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది.