20 April, 2026 | 8:03 PM

సమాజంలో అంగన్వాడీ టీచర్లది గురుతర బాధ్యత

20-04-2026 06:47 PM

- వారి సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం చేస్తా

– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): సమాజంలో అంగన్వాడీ టీచర్లు ఎంతో కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తున్న 357 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.

గత ప్రభుత్వాల కాలంలో ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు లేకపోయిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్చించే అవకాశం ఉందన్నారు.అంగన్వాడీ టీచర్ల పని చిన్నదిగా కనిపించినా, వారి బాధ్యతలు ఎంతో పెద్దవని, ఆరు సంవత్సరాల లోపు చిన్నారులను కన్నతల్లిలా చూసుకుంటున్నారని ప్రశంసించారు. వారికి ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. అంతేకాకుండా, అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న చిన్నారులకు యూనిఫాములు పంపిణీ చేశారు. టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను సందర్శించి, స్వయంగా తయారుచేసిన పౌష్టికాహార పదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.