30 July, 2026 | 3:08 PM

63 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

30-07-2026 02:08 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని 63 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలు అప్పుల భారానికి గురికాకుండా తమ కుమార్తెల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు.

గురువారం బాన్సువాడలోని తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఆర్భాటాలకు వెళ్లి అప్పులు చేసి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా తమ కుమార్తెల వివాహాలను నిర్వహించుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు.ప్రస్తుతం వివాహం అనంతరం అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను భవిష్యత్తులో వివాహానికి ముందే అందించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వెల్లడించారు.

అనంతరం రైతాంగ సంక్షేమంపై మాట్లాడుతూ, రైతులకు ఏడాది పొడవునా సాగునీటి కొరత లేకుండా ఉండేలా ప్రభుత్వం నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నామని, వీటి ద్వారా భూగర్భ జలమట్టాలు పెరగడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన నీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.