30 July, 2026 | 3:08 PM

కుంటలు, చెరువులను పరిశీలించిన సామాజిక కార్యకర్త

30-07-2026 02:09 PM

అతి భారీ వర్షాల నేపథ్యంలో కుంటలు, చెరువులను పరిశీలించిన సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి

మల్లాపూర్, జులై 30 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో జులై 28 అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి గురువారం గ్రామంలోని కుంటలు, చెరువులు, పాత ఇండ్లు, కాలువలు, మత్తడులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భారీ వర్షాలకు చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో మత్తడులపై నుంచి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఏనుగు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మరో రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, చిన్న పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే యువత ఫోటోలు, సెల్ఫీల కోసం చెరువులు, కుంటలు, వాగులు, మత్తడుల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని హెచ్చరించారు.అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలు అధికారులకు సహకరిస్తూ భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మల్లాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.