8 April, 2026 | 10:04 PM

ఆత్మరక్షణకు అస్త్రం.. క్రమశిక్షణకు మార్గం మార్షల్ ఆర్ట్స్

08-04-2026 08:40 PM

- మాస్టర్ మురళీధర్ ముదిరాజ్

- కరాటేలో గౌరీ శంకర్ ప్రతిభ: బ్రౌన్ బెల్ట్ సాధన

అమీర్‌పేట,(విజయక్రాంతి): ఆత్మరక్షణకు అస్త్రం క్రమశిక్షణకు మార్గంగా మార్షల్ ఆర్ట్స్ నిలుస్తుందని శోటో ఖాన్ అకాడమీ మాస్టర్ మురళీధర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం అమీర్‌పేటలోని గురుగోవింద్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కరాటే శిక్షణ , గ్రేడింగ్ పోటీల్లో గౌరీ శంకర్ విశేష ప్రతిభ కనబరిచి 'బ్రౌన్ బెల్ట్' కైవసం చేసుకున్నారు. జపాన్ షాటోకాన్ కరాటే డో కన్నింజుకు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీధర్ ముదిరాజ్, బాబు రాజ్ లు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు.మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం పంచ్‌లు, కిక్కులు మాత్రమే కాదు. ఇందులో అంతర్లీనంగా ఉండే యోగా, ధ్యానం మనిషికి ఏకాగ్రతను పెంచుతాయని అన్నారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణ వల్ల శరీరంలోని ప్రతి కండరం బలోపేతం అవుతుందని తెలిపారు. రక్తప్రసరణ మెరుగుపడి, స్థూలకాయం వంటి సమస్యలు దరిచేరవు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత కాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యుద్ధ విద్యలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు.

పిల్లల్లో క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం పెంపొందించడంలో మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఓటమిని తట్టుకునే శక్తిని, మళ్ళీ ప్రయత్నించే పట్టుదలను ఇవి నేర్పుతాయి. పాఠశాల స్థాయి నుంచే యుద్ధ విద్యలను పాఠ్యప్రణాళికలో చేర్చడం వల్ల భావి భారత పౌరులు ఆరోగ్యవంతంగా, ధైర్యవంతులుగా తయారవుతారని అన్నారు. గౌరీ శంకర్ ప్రదర్శించిన నైపుణ్యాన్ని అభినందిస్తూ ఆయనకు బ్రౌన్ బెల్ట్, సర్టిఫికేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ ప్రతినిధులు, శిక్షకులు , క్రీడాకారులు పాల్గొన్నారు.