25 August, 2026 | 5:16 AM

ఘనంగా దేవులపల్లి రామానుజరావు జయంతి

25-08-2026 01:31 AM

ముషీరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ సారస్వత పరిషత్తులో డా. దేవులపల్లి రామానుజరావు 109వ జయంతిని ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు ఆయన తెలుగు భాషా సాహిత్య సేవలను స్మరించుకున్నారు.

పరిషత్తు పూర్వ అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు దశాబ్దాలుగా తెలుగు భాషకు సేవలందించారని స్వాగతోపన్యాసంలో రింగు రామమూర్తి తెలిపారు. ‘గోల్కొండ’తో పాటు పలు ప్రముఖ పత్రికలకు సంపాదకత్వం వహించారని, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రస్తుత తెలంగాణ సారస్వత పరిషత్తు సేవలను ఆయన కొనియా డారని పేర్కొన్నారు.

సభాధ్యక్షులు, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ డా. రామానుజరావు తెలంగాణ వైతాళికుడని, ఆయన రచనలు సప్త నదుల సంగమంలా విస్తృతమైనవని అన్నారు. పరిషత్తు కోశాధికారి శ్రీ మంత్రి రామారావు మాట్లాడుతూ రామానుజరావు అంటే పరిషత్తు.. పరిషత్తు అంటే రామానుజరావు అన్నంతగా ఆయనకు పరిషత్తుతో అనుబంధం ఉందన్నారు.

ఆయన రేడియో ప్రసంగాలను గుర్తుచేస్తూ, అనేక మందికి వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభించేందుకు సహకరించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రముఖ రచయిత, బహుభాషావేత్త, సాహితీ పురస్కార గ్రహీత డా. నలిమెల భాస్కర్ మాట్లాడుతూ రామానుజరావు తెలుగు సాహిత్య రంగంతో పాటు ఆంగ్ల భాషలోనూ అనర్గళంగా ప్రసంగించిన గొప్ప వక్త అని, విశ్వమానవ భావాలను అనువదించిన మహోన్నత అనువాదకుడని అన్నారు.