12 August, 2026 | 12:59 PM

ప్రజలకు ఇబ్బందులు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలి

12-08-2026 01:04 AM

మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

మధిర, ఆగస్టు 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిర పట్టణంలో సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా మంగళవారం నాడు మధిర పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ పదేళ్ల పాలనలో మధిర పట్టణం లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు, సుందరీకరణ జరిగిందని కానీ ఇప్పుడు మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టానుసారంగా మార్కింగ్ చేసి ప్రజల ఆస్తులను కూల్చివేతలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

అండర్ డ్రైనేజీ నిర్మాణం పేరుతో ఇప్పటికే పట్టణం లోని రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశారని వాటికి మరమ్మతులు చేయకుండానే మళ్లీ అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పేరుతో రోడ్లను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మధిర లో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.