12 August, 2026 | 1:22 PM

పాతబస్తీలో 'హర్ ఘర్ తిరంగా'.. పాల్గొన్న బీజేపీ చీఫ్

12-08-2026 12:22 PM

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramchander Rao) ఓల్డ్ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా  రామచందర్ రావు మాట్లాడుతూ... ఈ ఉదయం హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా నిర్వహించిన తిరంగా ర్యాలీలో(Tiranga Rally) పాల్గొనే మహద్భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. మనం త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబట్టి ముందుకు సాగుతున్న ప్రతి క్షణం, స్వాతంత్ర్య సమరయోధులు, వీర జవాన్ల అపార త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

వారి ధైర్యం, అంకితభావం, దేశసేవ వల్లనే నేడు మనం గర్వించే భారతదేశం మన ముందుందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ నూతన ఆత్మవిశ్వాసంతో, మరింత బలంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా నిరంతరం పురోగమిస్తోందని స్పష్టం చేశారు. త్రివర్ణ పతాకాన్ని గర్వంతో, గౌరవంతో, మర్యాదతో చేతబట్టడమే కాదు, దాని స్ఫూర్తిని మన హృదయాల్లోనూ నిత్యం నిలుపుకుందామన్న బీజేపీ చీఫ్ మరింత శక్తివంతమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర భారతాన్ని నిర్మిస్తూ వికసిత్ భారత్ సాధించడమే మనందరి సమష్టి సంకల్పం కావాలని పిలుపునిచ్చారు.