రాయదుర్గం ఏక్తా మాల్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా
పోలీసుల అడ్డంకులతో ఉద్రిక్తత
శేరిలింగంపల్లి,ఆగస్టు12(విజయక్రాంతి): రాయదుర్గంలోని మల్కం చెరువు(Malkam Cheruvu) ఎదురుగా నిర్మాణంలో ఉన్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ ప్రాజెక్టు(PM Ekta Unity Mall Project) స్థలం వద్ద బుధవారం ఉదయం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు సహా పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించేందుకు సైట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని ప్రవేశానికి అనుమతించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ప్రధాన ద్వారం వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు బైఠాయించి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై నినాదాలు(BRS Protest) చేశారు.ప్రాజెక్టులో పారదర్శకత ఉందా లేదా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాం. పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని నేతలు ప్రశ్నించారు.
కొందరు కార్యకర్తలు పోలీసు బ్యారికేడ్లను దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.ఈ ప్రాజెక్టు రూ.2,060 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర సహాయంతో చేపట్టినది. ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసి, టెండర్ ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయని, ప్రైవేట్ డెవలపర్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ప్రభుత్వ వాటా, ప్రైవేట్ వాటా నిష్పత్తిపై సందేహాలు వ్యక్తం చేస్తూ టెండర్ రద్దు, స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.ప్రజా నిధులు, ప్రభుత్వ భూమి వినియోగంపై పారదర్శకత ఉండాలనే డిమాండ్‌తో ఈ ధర్నా జరుగుతోంది. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.






