మూడు దశల్లో భద్రాద్రి అభివృద్ధి
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేయాలి
- 2027 మార్చి 31 నాటికి తొలిదశ పనులు పూర్తి
- ఆలయ అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి) : భద్రాచల సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణ అనుగుణంగా అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగ మశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలుండాలని చెప్పారు. వచ్చే గోదావరి పుష్కరాలనాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి, అంచనాల తో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని ఘాట్స్ నిర్మాణం, అభివృద్ధి ఉండాలని సూచించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు లక్ష్యంగా పనిచేయాలన్నారు.
పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తిచేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశిం చారు. సమాశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.




