అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ రైజింగ్–2047తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి
భూపాలపల్లి, ఆగస్టు 15 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రైజింగ్–2047తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి(Government Whip Yennam Srinivas Reddy) అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భూ భారతి ద్వారా జిల్లాలో 223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4,586 ఇళ్లు మంజూరు చేసి 797 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశామని వివరించారు. రైతు రుణమాఫీ కింద 29,683 మంది రైతులకు రూ.299.34 కోట్లు, రైతు భరోసా కింద 1,27,151 మంది రైతులకు రూ.144.93 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి జీరో బిల్లులు జారీ చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు, మహిళా సంఘాల బలోపేతం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చామని, ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
అనంతరం పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. సమాచార పౌర సంబంధాలు, డిఆర్డీఏ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, స్టాళ్లను పరిశీలించారు. అనంతరం డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.






