ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ బకాయిలు
ప్రతి సమస్యనూ మానవీయ కోణంలో చూస్తాం.
ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ చేతల్లో మానవీయ కోణం కనిపించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. పీఆర్ సీ, డీఏల బకాయిల గురించి స్పష్టం చెప్పాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వివరణ పట్ల నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమాధానం చెప్పారు.
ప్రతి సమస్యనూ తాము మానవీయ కోణంలోనే చూస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డీఏ బకాయిలు(DA Arrears) గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని, మిగతా డీఏ బకాయిలు కూడా త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ ప్రయోజనాలు గత ప్రభుత్వం చెల్లించలేదని భట్టి ఆరోపించారు. రిటైర్ మెంట్ ప్రయోజనాలు చెల్లించలేకే పదవీ విరమణ వయసు పెంచారని తెలిపారు. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందని వివరించారు.
గత ప్రభుత్వం రూ. 40,154 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని లెక్కచెప్పారు. ఉద్యోగులకు కూడా రూ. 4,571 కోట్ల బకాయిలు పెట్టారని, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెల రూ. 700 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మానవీయ కోణం ఉంది కనుకే ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని పేర్కొన్నారు.




