11% తక్కువ వర్షపాతం
పశ్చిమ భారత్‌లో దట్టమైన మేఘాలు
జూలై నాటికి కురవాల్సింది 446.3మి.మీ
కురిసిన వర్షపాతం 395.5మి.మీ
న్యూఢిల్లీ, ఆగస్టు 2: భారతదేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ అత్యంత అసమానంగా కొనసాగుతోంది. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకోగా, వాయువ్య ప్రాంతాలు, ఇండో-గాంగేటిక్ మైదానాలు పొడి వాతావరణం ఉంది. ఈ అసమానతల వల్ల ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు 11 శాతంగా నమోదైంది.
జూన్ 4 నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 446.3 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 395.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా వివరాలను వెల్లడించింది. అయితే ఆగస్టు 3 నుంచి ఉత్తరాదిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ఆదివారం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు దేశంలో ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. జూన్ నెలతో పోలిస్తే వర్షపాత లోటు కొంత తగ్గినప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేదు.
పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం తీసిన చిత్రం ప్రకారం పశ్చిమ భారత్‌లో ఒక అల్పపీడనం క్రియాశీలకంగా ఉంది. దీని ప్రభావంతో గుజరాత్, దాని పరిసర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దానికి భిన్నంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. రుతుపవనాల ద్రోణి ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉందని, దీనివల్ల రాబోయే రోజుల్లో వాయువ్య రాష్ట్రాల్లో వర్షాలు పెరుగుతాయని నిపుణులు తెలిపారు.






