30 June, 2026 | 5:20 PM

భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

30-06-2026 04:34 PM

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి

కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. జీఓ నెం.12ను వెంటనే రద్దు చేసి, సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సీఎస్సీ సంస్థ నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.

సహజ మరణ పరిహారాన్ని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రెన్యువల్ కాని లేబర్ కార్డులను తక్షణమే పునరుద్ధరించాలని, పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, గృహ వసతి తదితర సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సంక్షేమ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా వారి సంక్షేమానికే వినియోగించాలని పేర్కొన్నారు.