30 June, 2026 | 5:54 PM

ఉద్యమకారుల హామీల అమలు కోసం జూలై 2న ఉప్పల్ బాగాయత్‌లో భూ పోరాటం

30-06-2026 05:02 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 2న ఉప్పల్ బాగాయత్‌లో భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జరగనుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకుడు నూనె మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల భూమి, గృహ నిర్మాణ సదుపాయం, ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పిస్తామని ప్రభుత్వాలు పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని విమర్శించారు.

ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధన, పెండింగ్ హామీల అమలు కోసం ఈ భూ పోరాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జూలై 2న నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు.