కలెక్టర్ సార్ ...ఇందిరమ్మ బిల్లు ఇప్పించరా!
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన భాగంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 2500 చొప్పున ఇండ్లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా మొదటి దఫలో2025లో మంగలి కులంలో ఏకైక వ్యక్తి జలగం. మమతకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు చేతుల మీదుగా పంపిణీ శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుడు సంబంధిత తుంగతుర్తి అధికారులతో ముగ్గుబోసి, ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టిన లబ్ధిదారులు బేస్మెంట్ పనులు పూర్తి చేసుకొని, మొదటి విడత బిల్లు కోసం అధికారులను సంప్రదించగా మీ పేర ఇల్లు మంజూరు కాలేదని ఐడి నెంబర్ తప్పుగా పడిందని మీరుపై అధికారులను కలవండని తిప్పుతూ కాలం గడిపించారు. సదరు కుటుంబ సభ్యులు ఒకసారి ప్రజావాణిలో కూడా సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ప్రతిరోజు కూలి పని చేసుకొని కుటుంబ జీవనం సాగించే మేము అధికారులు చేసిన పొరపాటు వల్ల నడి రోడ్డున పడ్డామని, ప్రస్తుతం 3000 రూపాయలు ప్రతి నెలకు అద్దె చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి, ఇంటి నిర్మాణం చేశామని లబ్ధిదారులు కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇల్లు ముగ్గు పోసే టైం లో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ సహకారంతోనే, నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు విచారణ జరిపించి, తప్పు చేసిన అధికారులపై, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.






