27 August, 2026 | 3:33 AM

108 కోసం ఎదురుచూపులు

27-08-2026 02:30 AM

‘దౌల్తాబాద్ కేంద్రంగా అంబులెన్స్ సేవలు బలోపేతం చేయాలని డిమాండ్

‘పాముకాటుకు చిన్నారి మృతి..

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆటోలో తరలింపు

హత్నూర, ఆగస్టు 26: హత్నూర మండలంలోని దౌల్తాబాద్, కాసాల, పరిసర గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సరిపడా అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులను ఇతర వాహనాల్లో ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

సకాలంలో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాసాల గ్రామానికి చెందిన చిన్నారి పాముకాటుకు గురైన సమయంలో అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర వాహనంలో ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తాజాగా కాసాల రైతు వేదిక వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంగలి సాయిరామ్ను 108 కోసం వేచి చూసినప్పటికీ అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడంతో చివరకు ఆటోలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనల నేపథ్యంలో దౌల్తాబాద్ను కేంద్రంగా చేసుకుని హత్నూర మండలంలోని కాసాల, దౌల్తాబాద్ తదితర పరిసర గ్రామాలకు తక్షణ అత్యవసర సేవలు అందేలా అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

కనీసం రెండు, మూడు అంబులెన్స్లను మంజూరు చేసి 108 సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి లేకుండా దౌల్తాబాద్ కేంద్రంగా శాశ్వత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో నిమిషాల ఆలస్యం కూడా కీలకమని, ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.