3 March, 2026 | 9:02 PM

నాలుగవ రోజు బీజేపీ రిలే నిరాహార దీక్ష

03-03-2026 06:37 PM

కాలేశ్వరం కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీ ఆర్‌డీ3-ఎల్‌ఎం6, ఎల్‌ఎం4 కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన రెండవ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో బీజేపీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, ఇంకా పలు గ్రామాల్లో కాలువ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. కాలువలు పూర్తికాకపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వేసవి కాలంలో నీటి ఎద్దడి కారణంగా బావులు, బోర్లు ఎండిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, దీంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ పనులు పూర్తి చేసి చెరువులను నింపితేనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు.