8 May, 2026 | 1:06 AM

ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా

08-05-2026 12:00 AM
  1. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలను బంద్ చేయాలి
  2. ఏసీలలో కూర్చోవడం కాదు రైతు కల్లాల్లోకి వచ్చి చూడండి
  3. తరుగుతీస్తే తొలుతీస్తా అన్న ముఖ్యమంత్రి ఎక్కడ?
  4. చౌటుప్పల్‌లో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన హరీష్ రావు

చౌటుప్పల్ , మే 7 : రైతులు వడ్ల కుప్పలపై ప్రాణాలు విడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదని, రైతులను కష్టాలలో వదిలేసి రైతు వారోత్సవాలను చేయడం సిగ్గు చేటని, ఆయన విధానం ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానాల మారిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు.

నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు  ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు, రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు గుండెలు అరచేతిలో పెట్టుకుని పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనీ అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు రాలేదని  కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని అన్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడటం లేదు, నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని ప్రెస్ మీట్ పెట్టీ వడ్లు కొంటున్నామని చెప్పడం కాదు

రైతుల బాధలు కొనుగోలు కేంద్రాల్లో తెలుస్తున్నాయనీ ఏసీ రూముల్లో కూర్చుంటే తెలియవని ఎద్దేవా చేశారు. 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారనీ, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే అని విమర్శించారు. తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల్లో, మిల్లులో రెండు చోట్లా తరుగు తీస్తూ రైతులను కష్టాల పాలు చేస్తున్నారని అన్నారు.తరుగు పెడితే తోలు తీస్తా అన్న ముఖ్యమంత్రి  ఎవరి తోలు తీస్తాడో చెప్పాలన్నారు.

మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారు. నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడు. ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుందన్నారు. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు రైతు వారోత్సవాలను చేస్తున్నారా అంటూ నిలదీశారు. రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దే అన్నారు.

కేసీఆర్  కరెంటు, సాగునీరు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ మీరు ధాన్యం కొనకుండా జాప్యం చేసి, రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకునేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ బిఆర్‌ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి,  మాజీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, మాజీ సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, రైతులు, బిఆర్‌ఎస్  కార్యకర్తలు పాల్గొన్నారు.