వేసవి శిక్షణ.. భవిష్యత్తుకు రక్షణ
సంస్థాన్ నారాయణపూర్, మే 7: సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో స్పోరట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగ, తైక్వాండో, వాలీబాల్ వంటి క్రీడల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. యోగ వలన విద్యార్థులకు ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతాయని, తైక్వాండో శిక్షణ ద్వారా తమ ఆత్మరక్షణ లభిస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు.
శిక్షణ సమయం
ఉదయం ఆరుగంటల నుండి తొమ్మిది గంటల వరకు మరలా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వ్యాయామ మెళకువలు నేర్పి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వాలీబాల్ శిక్షణ ఇస్తున్నారు. సాయంత్రం అరగంట పాటు తైక్వాండో ద్వారా ఆత్మరక్షణలో మెళకువలు నేర్పి అరగంట పాటు పెద్దల పట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను,స్పూర్తి దాతల జీవిత విశేషాలను బోధిస్తున్నారు.
పౌష్టికాహారం
శిక్షణ సమయంలో ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు, ఒక అరటి పండును అందజేస్తు న్నారు. ప్రతి రోజు తీసుకోవాల్సిన ఆహారం గురించి చక్కని అవగాహన కల్పిస్తున్నారు.
నాలుగు సంవత్సరాలుగా శిక్షణ..
జిల్లా యువజన, క్రీడా శాఖా,సంస్థాన్ నారాయణపూర్ స్పోరట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ టీచర్ బాలగోని యాదయ్య సలహాతో స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు సైదులు శిక్షణ మొదలు పెట్టారు. గ్రామానికి చెందిన సికిలమెట్ల ప్రభాకర్, శ్రవణ్, బద్దుల మురళి, ధనుష్, యశ్వంత్, రవి, సురేష్ సహకారంతో శిక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకు గుర్రం కృష్ణ, మల్లేష్, భరత్ మాస్టర్లు తైక్వాండో శిక్షణ ఇస్తున్నారు.
వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
‘గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనతో యోగ, వాలీబాల్, ఆత్మరక్షణ కోసం తైక్వాండో శిక్షణ ఇప్పిస్తున్నాం. పెద్దల పట్ల సమాజం పట్ల నడుచుకోవాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులు నారాయణపురం నుండి తయారు కావాలన్నదే లక్ష్యం‘.
చిలువేరు సైదులు, స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు






