8 May, 2026 | 1:07 AM

పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్

08-05-2026 12:00 AM
  1. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాల కల్పన 
  2. అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా అభివృద్ధి ప్రణాళికలు
  3. ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అవతరిస్తుం దని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను భారీస్థాయిలో ఆకర్షించేలా.. మహానగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు.

గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు.

ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్య స్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు. అందుకే భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.

కేవలం టెక్ కంపెనీలే కాకుండా బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్‌ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటు న్నాయన్నారు. గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి, వాటిల్లో కొత్తగా లక్ష మం దికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆప రేషన్లకే పరిమితం చేయకుండా వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామ న్నారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

హైదరాబా ద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం చైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ పాల్గొన్నారు.