27 March, 2026 | 4:25 AM

సేంద్రియ విధానం పంటలకు చైనాలో డిమాండ్

27-03-2026 02:44 AM

మానుకోట మార్కెట్ ను సందర్శించిన చైనా వ్యాపారులు 

మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): అధిక మోతాదులో ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించిన పంట ఉత్పత్తులను చైనా దేశంలో వినియోగించమని ఆ దేశ వ్యాపారులు జాక్, యాస్మిన్ వెల్లడించారు. సేంద్రీయ పద్ధతులు, సంప్రదాయ విధానంలో పండించిన పంటల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుందని, అలాంటి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తాము ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో చైనా వ్యాపారులు సందర్శించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కు రైతులు విక్రయానికి తెచ్చిన వివిధ రకాల పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పండించే మిర్చి పంటను తమ దేశానికి దిగుమతి చేసు కునేందుకు మార్కెట్ సందర్శనకు వచ్చినట్టు చెప్పారు. అయితే ఎక్కువగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించడం వల్ల తమ దేశంలో ఆ పంట ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని చెప్పారు. ఇక్కడి పంటల సాగు విధానం, నాణ్యత, దిగుబడి, ధరల అంశాలను స్థానిక వ్యాపారులు చైనా వ్యాపారులకు వివరించారు.