బీజేపీ నుంచి టీఆర్పీలో చేరికలు
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు శ్రీకాంత్ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో తన అనుచరులతో కలిసి చేరారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారం రావాలని, అట్టడుగు వర్గాల పిల్లలకు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు అందాలని స్పష్టమైన సిద్ధాంతంతో పోరాడుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని తెలిపారు. బీసీల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలు సంఖ్యలో ఎక్కువైనా అధికారంలో మాత్రం దూరంగా ఉంచుతున్నారని అన్నారు. బీసీల చెమటతో సంపదలు సృష్టించుకునే వర్గాలు రాజకీయ అధికారాన్ని మాత్రం తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు, గుండ్ల పోచంపల్లి ప్రాంత కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






