8 May, 2026 | 1:04 AM

టికెట్లు ఇచ్చిన వారికే మళ్లీ పదవులు

08-05-2026 12:00 AM

హామీ ఇచ్చిన వారికి మొండి చెయ్యి 

కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి 

అధిష్టానం తీరుపై అసహనం 

మేడ్చల్, మే 7 (విజయక్రాంతి): వడ్డించేవాడు మనవాడు అయితే.. బంతి చివర్లో కూర్చున్న కంచంలో అన్ని వచ్చి చేరుతాయని చందంగా తయారైంది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి. అగ్ర నాయకుల ఆశీస్సులతో కొందరికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వడంతో మిగతా నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు రాని నాయకులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చినా పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తునా పదవులు రావడం లేదు. కానీ టికెట్లు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడంతో మిగతా నాయకులు మదన పడుతున్నారు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు టికెట్ల కోసం పోటీపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన వారికి సైతం హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. టికెట్లు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. కానీ వారికి ఇంతవరకు న్యాయం చేయకపోవడమే గాక ఓడిపోయిన వారికి పదవులు ఇస్తున్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఐదు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. కొన్నిచోట్ల అభ్యర్థులు గెలుస్తున్నామన్న అతి విశ్వాసంతో చివరలో నిర్లక్ష్యం చేయడంతో ఓడిపోయారు.

అప్పుడు టికెట్లు ఇచ్చి ప్రస్తుతం పదవులు ఇస్తున్నారు. ఇదంతా అగ్ర నాయకుల ఆశీస్సుల వల్లే లభించిందని కాంగ్రెస్ లోని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నుంచి 2023 ఎన్నికల్లో ఓడిపోయిన బండి రమేష్ కు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన వజ్రేష్ యాదవ్ కు డి సి సి అధ్యక్ష పదవి దక్కింది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో కొందరు అధిష్టానం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగం కాలం గడిచిపోయిందని ఇంకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 

న్యాయం చేస్తామని హామీ ఇచ్చి..

ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరిని పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేర్చుకున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఉనికిని కాపాడిన నాయకుల సైతం టికెట్లు ఆశించారు. ఇలాంటి వారికి ఇప్పటికీ పదవులు రాలేదు. రెండున్నర ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

మార్చు 15వ తేదీ లోపు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు ప్రకటించడంతో పదవులు వస్తాయని ఆశపడ్డారు. రెండు నెలలు గడిచిన పదవులు రాలేదు. ఇటీవల కుల సంఘాలకు చెందిన కార్పొరేషన్లు మాత్రమే భర్తీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, భూపతిరెడ్డి నర్సారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, శ్రీరంగం సత్యం తదితరులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. 

ద్వితీయ శ్రేణి నాయకులకు డైరెక్టర్లుగా..

ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల సైతం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మొత్తం అర్బన్ జిల్లాగా మారింది. మూడు మున్సిపాలిటీలు మినహా మిగతా ప్రాంతమంతా మల్కాజ్గిరి, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లలో చేర్చడంతో పదవులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్ లను మాత్రమే నియమించింది డైరెక్టర్ లను నియమించలేదు. డైరెక్టర్ పదవులు ప్రతి నియోజకవర్గానికి రెండు కేటాయించాలని గతంలో పార్టీ నిర్ణయించింది. అప్పట్లో జిల్లా నుంచి పేర్లు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పటికీ పదవులు రాలేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలని నాయకులు కోరుతున్నారు.