1 August, 2026 | 1:44 AM

సర్కారు వెలవెల.. ప్రైవేట్ కళకళ!

01-08-2026 12:00 AM

ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య 

60 సర్కారు బడుల్లో 2,316 మంది..

8 ప్రైవేట్ స్కూళ్లలో 3,599 మంది విద్యార్థులు

కల్లూరు, జులై 31 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ,కల్లూరు మండలంలోని తాజా గణాంకాలు మాత్రం విరుద్ధ దృశ్యాన్ని చూపిస్తున్నాయి. మండలంలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 2,316 మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండగా, కేవలం 8 ప్రైవేట్ పాఠశాలల్లోనే 3,599 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే 1,283 మంది విద్యార్థులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రాథమిక పాఠశాలల్లో దారుణ పరిస్థితి

ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. విశ్వనాథపురం పెద్ద ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండగా, రఘునాథగూడెంలో 2, ఎర్రబోయినపల్లిలో 5, పాయపూరులో 5, బత్తులపల్లిలో 6, ఎర్రబంజరలో 9 మంది మాత్రమే చదువుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ విద్యా వ్యవస్థకు ప్రమాద సంకేతంగా మారుతోంది.

అప్పర్ ప్రైమరీల్లో కూడా అదే దుస్థితి

అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లక్ష్మీపురంలో 8 మంది, హనుమతండాలో 13 మంది, చైతన్యనగర్లో 14 మంది, ఎన్టీఆర్ కాలనీలో 13 మంది, లోకారంలో 24 మంది, పుల్లయ్య బంజరలో 25 మంది, వాచ్య నాయక్ తండాలో 25 మంది, రఘునాథ్ బంజరలో 29 మంది, కొర్లగూడెంలో 33 మంది విద్యార్థులతోనే తరగతులు కొనసాగుతున్నాయి.

హైస్కూల్లలోనూ ఆశించిన స్థాయిలో నమోదు లేదు

మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. పేరువంచలో 45 మంది, చెన్నూరులో 128 మంది, చిన్న కోరుకొండిలో 157 మంది, వెన్నవల్లిలో 38 మంది, ఎర్రబోయినపల్లిలో 41 మంది, బత్తులపల్లిలో 40 మంది, కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 245 మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 202 మంది, చుండ్రుపట్లలో 75 మంది మాత్రమే చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు లేక తరగతి గదులు వెలవెలలాడుతున్నాయి.

ప్రైవేట్ వైపు మొగ్గు ఎందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, పుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అమల్లో ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ఉపాధ్యాయుల కొరత, ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతులు బోధించడం, మౌలిక వసతుల లోపం, నాణ్యమైన బోధనపై సందేహాలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

తక్షణ చర్యలు అవసరం

60 ప్రభుత్వ పాఠశాలల్లో 2,316 మంది& కేవలం 8 ప్రైవేట్ పాఠశాలల్లోనే 3,599 మంది& అనే గణాంకాలు ప్రభుత్వ విద్య ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ,మౌలిక వసతుల మెరుగుదల, బోధన నాణ్యత పెంపుపై తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వ పాఠశాలల ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నారు.