15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్

15-04-2026 10:56 AM

శక్తి: ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత విద్యుత్ కేంద్రంలో(Chhattisgarh Vedanta power plant blast) సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరిందని, గాయాల కారణంగా మరో కార్మికుడు మృతి చెందాడని పోలీసులు బుధవారం తెలిపారు. సింగితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో బాయిలర్ నుండి టర్బైన్‌కు అధిక పీడనంతో కూడిన ఆవిరిని తీసుకువెళ్తున్న ఉక్కు గొట్టంలో భారీ పేలుడు సంభవించింది. ఈ శక్తివంతమైన పేలుడు కారణంగా పలువురు కార్మికులు తీవ్రంగా కాలిపోగా, నలుగురు కార్మికులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరో 10 మంది గాయాల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.

మంగళవారం, బుధవారం మధ్య రాత్రి మరో కార్మికుడు మరణించడంతో మృతుల సంఖ్య 14కు చేరిందని శక్తి ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మిగిలిన 20 మంది కార్మికులలో, ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం రాయపూర్‌కు తరలించారని, కాగా 15 మంది రాయగఢ్ జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. ఈ ఘటనపై బిలాస్‌పూర్ డివిజన్ కమిషనర్ ద్వారా విచారణ జరిపించాలని ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ అధిపతి సుశీల్ ఆనంద్ శుక్లా బుధవారం ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధ్యులను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిందించారు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి, గాయపడినవారికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని సుశీల్ ఆనంద్ శుక్లా డిమాండ్ చేశారు.