మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
కారేపల్లి,(విజయ క్రాంతి): గత కొన్నేండ్లుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల తిరిగి పునః ప్రారంభం కావడానికి సిద్ధమైంది.పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో 2022వ సంవత్సరంలో ఆ పాఠశాల మూతబడింది. రాష్ట్ర ప్రభుత్వం మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించాలని ఆదేశాలు జారీ చేయగా తమ గ్రామంలో తిరిగి పాఠశాల ప్రారంభం కాబోతుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలం గంగారం తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కొరతతో 2022 సంవత్సరంలో మూతబడింది.
అప్పటి ఉపాధ్యాయులు పాఠశాలను మళ్లీ తిరిగి ప్రారంభించాలని ప్రయత్నించినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వబడికి పంపేందుకు ముందుకు రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు.తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గంగారమ్ తండా సర్పంచ్ గా ఎన్నికైన భూక్యా కిరణ్ తల్లిదండ్రులను చైతన్య పరిచి విద్యార్థులను రప్పించేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో గంగారం తండా గ్రామంలో గురువారం నుండి పాఠశాలను తెరిపించేందుకు మండల విద్యాశాఖ అధికారి జయరాజ్ ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ జయరాజు మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు,మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తుందని, అంతేకాకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన చేనున్నామని పేర్కొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని స్థానిక సర్పంచ్ కిరణ్ హామీ ఇచ్చారు.పాఠశాల ప్రారంభానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.






