19 May, 2026 | 3:41 AM

ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు

19-05-2026 01:18 AM

అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం 

బెజ్జంకి, మే 18: సిద్దిపేట జిల్లాబెజ్జంకి మండల కేంద్రంలోని  రైతుల పొలం వద్ద చేతికి అందే ఎత్తులో కరెంట్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ విషయం పట్ల విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం మండల పరిధిలో ఓ హార్వెస్టర్ యంత్రం కరెంట్ తీగలను తాకడంతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.

అయినప్పటికీ అధికారులు పర్యవేక్షణ పెంచకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాల్లో వ్యవసాయ పనులు కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కరెంట్ తీగలను ఎత్తుగా ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పంట పొలలో కరెంట్ తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రతి రోజూ భయాందోళనలోనే పనులు చేస్తున్నాం. చిన్న తప్పిదం జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలో పంట కాలిపోయిన ఘటన ఎన్నో ఉన్నాయి. అధికారులు వెంటనే వచ్చి పరిస్థితిని పరిశీలించి తీగలను సరిచేయాలి.

ఆనంద్, రైతు

పంటలు కోత దశలో ఉన్నాయి. హార్వెస్టర్, ట్రాక్టర్ వంటి యంత్రాలు పొలాల్లో తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కరెంట్ తీగలు చేతికి అందేలా ఉండటం ప్రాణాలకు ముప్పు. ఎవరైనా ప్రమాదానికి గురైతే బాధ్యత ఎవరిది ,అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి.

ఎల్లయ్య, రైతు