24 April, 2026 | 3:13 AM

డేటా కేబుళ్లకు ప్రమాదం

24-04-2026 12:33 AM
  1. వీటికి నష్టం వాటిల్లితే..గల్ఫ్ అంతా తీవ్ర అంతరాయమే 
  2. ఇరాన్ తాజా హెచ్చరిక

ట్రెహాన్, ఏప్రిల్ 23: సీజ్‌ఫైర్ వేళలో కూడా అమెరికా హోర్ముజ్‌ను దిగ్బంధించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జలసంధిలో డేటా కేబుళ్లు తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఐఆర్‌జీసీకి అనుబంధంగా పనిచేసే తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ హెచ్చరించింది. ‘ప్రమాదాల వల్ల గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ వీటికి ఏమైనా నష్టం వాటిల్లితే.. పర్షియన్ గల్ఫ్ అంతా తీవ్ర అంతరాయం కలగొచ్చు’ అని పేర్కొంది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకే కాదు.. డిజిటల్ మౌలిక సదుపాయాలకు కూడా చాలా కీలకమని తస్నీమ్ స్పష్టం చేసింది. బ్యాకింగ్, క్లౌడ్ సర్వీస్, కమ్యూనికేషన్లకు ప్రధానమైన ఫాల్కన్, ఏఏఈ-1, టీజీఎన్-గల్ఫ్, ఎస్‌ఈఏ-ఎంఈ-డబ్ల్యూఈ వంటి భూగర్భ కేబుళ్ల వ్యవస్థలు హోర్ముజ్ నుంచే వెళ్తున్నాయి.

ఈ కేబుళ్లన్నీ ఇరుకైన మార్గంలో కుప్పపడినట్టుగా ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇరాన్ కంటే యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా పైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఇవన్నీ నోటిమాట బెదిరింపులేమీ కాదు. ప్రాంతీయ ఘర్షణల కారణంగా 2024, 2025లో ఎర్రసముద్రంలోని పలు భూగర్భ కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రవేశం చాలా క్లిష్టంగా ఉండటంతో వాటిని మరమ్మతు చేయడానికి అప్పట్లో కొన్ని నెలల సమయం పట్టింది.

యుద్ధం తీవ్రరూపం దాలిస్తే హర్మూజ్లో ఇరాన్.. ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్ అల్ మందేబ్ జలసంధిలో ఉన్న సముద్రగర్భ కేబుళ్లను హౌతీలు టార్గెట్ చేస్తారా..? అన్న అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం తస్నిమ్ కథనం ప్రకారం.. ఆర్థిక, కమ్యూనికేషన్ ప్రభావం ఎక్కువగా పడే కేబుల్ మార్గాలు, ల్యాండింగ్ స్టేషన్లు, డేటా హబ్లను ఇరాన్ హైలైట్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యూఏఈ, బహ్రెయిన్లో క్లౌడ్, డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు ఒకేచోట కేంద్రీకృతమై ఉన్నాయి. కేబుళ్లకు ఏమాత్రం కోత పడినా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.