06-02-2026 01:41:11 AM
ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఉత్తర్వులు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 259.36 కోట్లను విడుదల చేసింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణామం. ఎన్నికల జాప్యంతో తెలంగాణలో రెండేళ్లుగా నిధులు నిలిచిపోయాయి.
2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సం బంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా అవి నిలిచిపోయాయి. దానితో గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే కేంద్ర పెద్దలకు రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పలు దఫాల విజ్ఞప్తులు చేశారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు ఇతర కేంద్ర పెద్దలను పలు దఫాలు ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు.
గ్రామ స్థాయి లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం , ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఎన్నికలు పూర్తికాకపోవడం కారణంగా నిధుల విడుదల సాధ్యపడలేదు. ఎన్నికల అనంతరం నిధుల విడుదలకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే నిధు లు శాశ్వతంగా రద్దు అయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు.
సంబంధిత శాఖ అధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి నిధులు తీసుకువచ్చే దిశలో దిశా నిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదింపులు జరిపారు.
అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ శ్రీధర్, ఇతర అధికారులు కూడా నిరంతరంగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.
మిగిలిన నిధులూ విడుదల చేయాలి..
15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు రూ. 3,000 కోట్ల వరకు రావాల్సిఉంది. అందులో తొలి విడతగా రూ. 259.36 కోట్లను విడుదల చేయడం పట్ల గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన నిధులు కూడా దశలవారీగా విడుదల చేయాల్సిఉంది. గ్రామ పంచాయతీలకు ఎంతో కీలకమైన నిధులు విడుదల కావడంపై మం త్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. అదే సమయంలో మిగిలిన పెండింగ్ నిధులను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.