మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలి
– ఆర్మూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
ఆర్మూర్,(విజయక్రాంతి): హిందూ చిన్నారులను మత మార్పిడి చేయడానికి కుట్ర పన్నిన వారిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేసారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్‌లోని భవిష్య దర్శిని అప్పర్ ప్రమరీ స్కూల్ (భరత్ చంద్ర స్కూల్)లో ముస్లిం మైనార్టీ ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులకు ఉర్దూ, నమాజ్, కల్మా చదవడం నేర్పించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న దినేష్ కులాచారి అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీలో పాల్గొని ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉర్దూ నేర్పించాలి అంటే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి కావాలన్న విషయం కూడా ఎంఐఎం నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రైమరీ తరగతులు చదివే చిన్నారులకు మతమార్పిడి చేసే కుట్ర చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలి రావడాన్ని తప్పుబట్టారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మైనార్టీ ఓట్ల కోసం బాన్సువాడలో మాట్లాడిన తీరును తప్పుబట్టారు. హిందూ విద్యార్థులను మతమార్పిడి చేస్తున్న వారికి అండగా నిలుస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.
అనంతరం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఆర్మూర్ మండల విద్యాధికారి కార్యాలయానికి ర్యాలీగా వెల్లి ధర్నా నిర్వహించి ఎంఈవో రాజగంగారాంకు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, పొల్కం వేణు, యామాద్రి భాస్కర్ పటేల్, కలిగోట ప్రశాంత్, దోండి ప్రకాష్, ద్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.






