హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని హనుమంతులపాడు గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి బోనాలు తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని, గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, సకాలంలో వర్షాలు, పంటల సమృద్ధి, సుఖశాంతులు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. గ్రామస్తులంతా ఐకమత్యంతో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయడం గ్రామ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.






