29 June, 2026 | 9:42 PM

మహిళా సంఘాలను ప్రోత్సహించాలి

29-06-2026 08:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లాలోని మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాల గురించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో అర్హులైన మహిళలందరినీ స్వయం సంఘాలలో చేర్పించి, స్త్రీ నిధి రుణాలను అందించాలన్నారు. రుణాలను అందించి వారు స్వయం ఉపాధి రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని వివరించారు. జిల్లా స్వయం సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులో అద్భుత ప్రగతి సాధిస్తున్నాయని కొనియాడారు. రుణాల తిరిగి చెల్లింపు విషయంలో డిజిటల్ పద్ధతులు అవలంబించాలని సూచించారు. డిజిటల్ పద్ధతి ద్వారా రుణ చెల్లింపు సులభతరం అవుతుందని తెలిపారు.