1,400 కోట్ల అవినీతి సొమ్ము
- క్విడ్ ప్రొ కో ద్వారా బీఆర్‌ఎస్‌కు వచ్చాయి
- వాటిని అమరవీరుల కుటుంబాలకు పంచాలి
- సింగరేణికి బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి
- టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (విజయక్రాంతి): క్విడ్ ప్రొ కో ద్వారా బీఆర్‌ఎస్ ఖాతాలోకి రూ.1,400 కోట్లు వచ్చాయని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆ పార్టీ ఖాతాలో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి బావిబాట రెండవ విడత కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె కొత్తగూడెంలోని సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను మళ్లీ బీఆర్‌ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరేదే లేదని స్పష్టం చేశారు.
అవినీతి విషయంలో బీఆర్‌ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ తలుపులు తెరిచిందనీ ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల హక్కులైన డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డును ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని, సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటుకై ఈ నెల 20 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కాగా తన పార్టీతో భయం లేదంటూనే బీఆర్‌ఎస్ వాళ్లు వెయ్యికి పైగా ఈసీకి ఫిర్యాదుల చేశారని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలకు ప్రజా అజెండా లేదన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చనీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల ద్వారా కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి ఎత్తిపోసుకోవ చ్చన్నారు. ముఖ్యమంత్రి రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడని, ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీ పార్థసారధి మహబూబ్ నగర్‌లో పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీని 10 వేల మంది మహిళలు ఫ్యాక్టరీ వద్దని ధర్నా చేస్తే వారిలో 90 మందిపై అక్రమ కేసులు, 9 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు.






