పంట మార్పిడి విధానాలతో రైతులకు మేలు
నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచాలి
గద్వాల, ఆగస్టు 27(విజయక్రాంతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆరుతడి, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో నానో ఎరువులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతు బీమా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఆయిల్‌పామ్ తోటలు, అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్, ఇఫ్కో మేనేజర్ కృపాశంకర్ తదితరులు పాల్గొన్నారు.






