నకిలీ విక్రయాలపై ఉక్కుపాదం
08-07-2026 12:00 AM
సిద్దిపేట రూరల్, జులై 7: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, నకిలీ లేదా నాణ్యతలేని వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ హెచ్చరించారు.
సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లులు, నిల్వలు, గడువు తేదీలు పరిశీలించారు. రైతులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అక్రమాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.






