20 June, 2026 | 10:05 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ రాజీలేని పోరాటం

20-06-2026 08:53 PM

"సర్" పేరుతో 80 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర: కూనమనేని సాంబశివరావు

- ఓట్ల గల్లంతు వ్యతిరేకంగా 23న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు

గజ్వేల్: ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ రాజీలేని పోరాటం చేస్తోందని, ప్రజా అంశాలపై అసెంబ్లీలో పాలక పక్షాన్ని నిరంతరం నిలదీస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సిపిఐ శిక్షణా తరగతుల సందర్భంగా శనివారం గజ్వేల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం "సర్" పేరుతో తెలంగాణలో 80 లక్షల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు.

దీనికి వ్యతిరేకంగా ఈ నెల 23న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ప్రజా చైతన్యంతో ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ఎండగడతామన్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో హరగోపాల్ వంటి మేధావులను వేధించడం సిగ్గుచేటని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, గౌరవప్రదమైన పీఆర్సీ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అలాగే రాష్ట్రంలో విడతల వారీగా కాకుండా అర్హులైన పేదలందరికీ ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలపై కూల్చివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. 58, 59 జీఓల ప్రకారం క్రమబద్ధీకరించిన పేదలకు వెంటనే అనుమతి పత్రాలు అందించాలని కోరారు. సింగరేణిలో  షేర్లు, రుణాల కోసం లేని బొగ్గును ఉన్నట్లు చూపిన అంశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు.

రైతులందరికీ  పంట రుణమాఫీ అమలు, బోనస్ తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కూనమనేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రకాశ్ రావు, మంద పవన్, దయానంద రెడ్డి, రాజేశం, శివలింగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.