బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ
బోధన్:మే 28 (విజయ క్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలోని బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా నేడు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ సదుపాయాలు , భక్తుల రాకపోకలు , సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని , శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని , అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) శుభం ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , సి.టి.సి ఎ.సి.పి రాజశేఖర్ , టౌన్ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారాయణ , సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






