9 April, 2026 | 1:31 PM

గొల్లపల్లి సభకు న్యాయస్థానం అనుమతి

09-04-2026 11:32 AM

హరీష్ రావు  పర్యటనతో ప్రభుత్వ గుండెల్లో గుబులు

ప్రజాధనాన్ని కాపాడడానికి గొల్లపల్లి సభ

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): 100 రోజులుగా రైతులు, ప్రజలు చేస్తున్న నిరసన కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్న సభ కోసం అనుమతి తీసుకుంటే అనుమతి ఇచ్చి రద్దు చేయడం జరిగిందని కానీ న్యాయస్థానం అనుమతి ఇవ్వడం నాయకులకు,అధికారులకు చెంప పెట్టు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలు సమావేశాలు ప్రజల ప్రాథమిక హక్కు అని 14ఏండ్లు శాంతియుతంగా ఉద్యమం  నడిపించామని సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఎందుకు బయపడుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం పనిచేయాలని ప్రజాధనం వృథా కాకూడదు అని మా అభిప్రాయమన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పనిచేయదని  వాగ్ధానాలు నెరవేర్చడం చేతకాదు కానీ నిరసనను తొక్కివేయడం న్యాయం కాదన్నారు. 

రైతు దీక్షలకు  మాజీ మంత్రి హరీష్ రావ్  సంఘీభావం తెలపడం జరుగుతుందని రైతులకు బాసటగా నిలవడానికి ఉద్యమం రాష్ట్ర స్థాయికి తీసుకుపోతామన్నారు. ఉద్యమాలు బి.ఆర్.ఎస్ పార్టీకి కొత్తకాదని, ఏనాడు శాంతి భద్రతలకు భంగం కలిగించలేదని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష బాధ్యత అని, పిల్లి శానార్థాలు పెడితే ఉట్టి తెగిపడదన్నారు.  ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో ఓపిక కావాలని, ప్రతిపక్ష,ప్రజా సంఘాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని,ప్రభుత్వ వివక్షతను ప్రశ్నించే మేధావులు ఎక్కడ ఉన్నారని, పోలీస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం పద్ధతి కాదన్నారు.  100రోజులు దీక్షలు చేసిన రైతులకు అభినందనలు మీకు మేము అండగా ఉంటామని  ప్రాజెక్టు కట్టాలి అంటే 80శాతం ప్రజలు రాజ్యాంగం ప్రకారం ఏకాభిప్రాయానికి రావాలన్నారు. రైతు భరోసా రైతు బీమా,మద్దతు ధర సంక్షేమ పథకాల అమలుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందని, భూసేకరణ అనేది ప్రభుత్వానికి సవాల్ అని ఆయన వివరించారు. తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాల కోసం కె.సి.ఆర్ ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని 

కె.ఎల్.ఏ పథకం 1984లో పుట్టపాగ మహేంద్ర నాథ్ 30లక్షల ఆయాకట్టుకు ప్రయోజనం కలిగే విధంగా రూపొందించండి అని అనాడే వినతి చేశారని 16జూన్ 1983 లో ఎన్.టి.ఆర్ సమగ్ర సర్వే కోసం ఆదేశించారన్నారు. కె.ఎల్. ఐ నుండి 2లక్షల 50వేల సాగు కోసం 3రిజర్వాయర్లు కట్టాలని 1998జులైలో చంద్రబాబు శంకు స్థాపన చేశారని, ఏలూరు,గుడిపల్లి,జొన్నాల బొగడ కేవలం 4టి.ఏం.సి సామర్థ్యం మాత్రమేనని, కె.సి.ఆర్ ఉద్యమంతో ప్రాజెక్టుల పూర్తి కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. వై.ఎస్.ఆర్ పోతిరెడ్డి పాడు ద్వారా 55క్యూసెక్కుల నీళ్లు తరలించూకుపోయారని పాలమూర్ ప్రాజెక్టులను వై.ఎస్.ఆర్ పడావ్ పెట్టారన్నారు. రూ 2800కోట్లతో కె.సి.ఆర్ కె.ఎల్. ఐ 4ఏండ్లలో  పూర్తి చేశారన్నారు. కె.సి.ఆర్ వరద జలాలను 25టి.ఏం.సి ల నుండి 40టి.ఎం.సి లకు పెంచడానికి కృషి చేశారని 40టి.ఎం.సి ల పూర్తి వాడకానికి  రిజర్వాయర్లు కు డి.పి.ఆర్ కోసం కె.సి.ఆర్ ఆదేశించారని 

అప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయ్యిందని  ఎదుల రిజర్వాయర్ ద్వారా 7టి.ఎం.సి ల సామర్థ్యంతో రైతులకు ప్రయోజనమన్నారు. డి5,డి8 కాలువలను ఆధునీకరించడం ద్వారా మరియు గణప సముద్రం,బుద్దారం ద్వారా మొత్తంగా 2లక్షల సాగు నీళ్లు అందించామని 2018 సెప్టెంబర్ నాడు ప్రభుత్వం గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదని తిరస్కరించిందని ఆయన వివరించారు. అవసరం లేని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కోసం 1352ఎకరాల భూసేకరణ చేయడం అవసరమా?ఎదుల రిజర్వాయర్ ప్రతిపాదన జరగక ముందు తాము గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన చేసానని .  ఎదుల రిజర్వాయర్ నిర్మాణం తర్వాత గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకున్నాం ఇది వాస్తవమని ఆయన వివరించారు.  ఈ సమావేశములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,జగదీశ్వర్ రెడ్డి,రఘుపతి రెడ్డి,మాణిక్యం,వనం.రాములు,వేణు యాదవ్,రఘువర్ధన్ రెడ్డి,దొడ్ల.రాములు,నాగన్న యాదవ్, వెంకట్ సాగర్,సూర్య వశం.గిరి,చిట్యాల.రాము,హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్,సయ్యద్. జెమిల్, తదితరులు పాల్గొన్నారు.