11-02-2026 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 10, (విజయక్రాంతి): గడచిన పది రోజుల నుంచి మారుమోగిన మైకులు సోమవారం సాయంత్రం తో మూగబోయాయి. ఆఖరి అస్త్రమైన ఓటర్లకు తైలం సమర్పించే పనిలో అభ్యర్థులు తలమునకై ఉన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జిహెచ్‌ఎంసి ఎన్నికలను తలపించేలా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలో దిగాయి.
ఎట్టకేలకు కార్పొరేషన్ జెండాను ఎగరవేయాలని ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఎర్రజెండా ఎగురవేయాలని సిపిఐ పోటీ పడుతున్నాయి. పది రోజులపాటు పరస్పర విమర్శలతో, ఘాటైన మాటలతో దాడులు చేసిన నేతలు, సోమవారం సాయంత్రం నుంచి ఓటర్లను ప్రభావితం చేసేందుకు పంపకాలను ప్రారంభించాయి. బిఆర్‌ఎస్ పార్టీ సైతం తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఇప్పటి అన్ని సర్వేలు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను కైవశం చేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కొక్క డివిజన్లో రూ 30 నుంచి రూ 40 లక్షల వరకు పంపకాలు చేస్తున్నట్టు సమాచారం. అదే స్థాయిలో సిపిఐ పార్టీ సైతం ఓటర్కురు రూ 1500 నుంచి రూ 2000 వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టిఆర్‌ఎస్ పార్టీ సైతం కొన్ని డివిజన్లో ఓటర్లు ప్రభావితం చేసేందుకు రూ 2 వేల నుంచి రూ2,500 వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకరికి మించి ఒకరు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
గతంలో రాత్రి వేళల్లో ఓటర్లకు డబ్బులు పంపించే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం పట్టపగలే ఓటర్ జాబితా ఆధారంగా అన్ని రాజకీయ పక్షాల నాయకులు బహిరంగంగా డబ్బుల పంపిణీ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు చీరలను, ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారుల నిఘా మాత్రం శూన్యం.
బీఆర్‌ఎస్ క్రాస్ ఓటింగ్ ?
అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఓట్లను సిపిఐ కి బద్దలాయిస్తరనే ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షులుగా పోటీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలకు రెండు పార్టీలు డి అంటే డి గా బరిలో ఉండటంతో రాజకీయం రసవతరంగా మారింది. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్ బలంగా లేని డివిజన్లలో సిపిఐ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ నాయకుల ప్రకటించడం కార్యకర్తల్లో అసంతృప్తి నెలకు ఉంది.
కూలీలకు రూ.400లు
ప్రచారంలో సైతం అన్ని రాజకీయ పార్టీలు విపరీతంగా డబ్బులు నేలలా ఖర్చు పెట్టారు. వారం రోజులపాటు కూలీలతో ర్యాలీలు ప్రచారాలు నిర్వహించారు. ఒక్కొక్క మనిషికి రోజుకు రూ 400 చొప్పున చెల్లించడంతోపాటు భోజనం సౌకర్యం కల్పించారు. ఏది ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జిహెచ్‌ఎంసి ఎన్నికలను తలపించాయనీ చెప్పక తప్పదు.