15 May, 2026 | 1:52 AM

పేరుకే కార్పొరేట్ ఆసుపత్రులు

15-05-2026 12:43 AM
  1. కనీస సౌకర్యాలు కరువు తరచు లిఫ్ట్ ప్రమాదాలు.. 
  2. హై కోర్టు ఆదేశాలు భేఖాతారు

కరీంనగర్, మే 14 (విజయ క్రాంతి) : కరీంనగర్ లో తరచు లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులలో చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. తాజాగా కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన సందర్భంగా లిఫ్ట్ కేబుల్ తెగి, ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయట పడ్డారు.

ఈ సంఘటనపై స్పందించిన మంత్రి సరైన వసతులు, నిపుణులైన వైద్యులు లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ అసూపత్రి ప్రారంభం సందర్బంగా లిఫ్ట్ ప్రమాదం జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మవెంకటేశ్వర్ గాయపడ్డారు. ప్రస్తుత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు తప్పించున్నారు. ఒక సారి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కూడా లిఫ్ట్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

హై కోర్టు ఆదేశాలు భేఖాతారు

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు మూడు నెలల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది లిఫ్ట్ భద్రతపై తెలంగాణ సర్కార్కు హైకోర్టు అల్టిమేటం కూడా జారీ చేసింది. భద్రతా నియమాలు లేకుండా సామాన్యుల ప్రాణాలు గాలిలో కలవాల్సిందేనా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ’తెలంగాణ లిఫ్ట్ల చట్టం-2025’ను వచ్చే నాలుగు వారాల్లోగా సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చట్టం చేయడానికి ప్రభుత్వం అడిగిన ఆరు నెలల సమయాన్ని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం తిరస్కరించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంత ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. నివాస, వాణిజ్య భవనాల్లో లిఫ్ట్ భద్రతకు ప్రత్యేక చట్టం లేకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేవని నిలదీసింది. చట్టం వచ్చే వరకు భద్రతా ప్రమాణాలపై తక్షణమే కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది

నిర్వహణ పై నిర్లక్ష్యం

లిఫ్ట్ల నిర్వహణలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం  వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో లిఫ్ట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులైన సిబ్బందితో రెగ్యులర్ సర్వీసింగ్ చేయకపోవడం, పాతబడిన లిఫ్ట్లను మార్చకపోవడం, లైసెన్స్ నిబంధనలను పాటించకపోవడం దీనికి ప్రధాన కారణం. గుండెపోటు, ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను ఐసి యూ లేదా ఆపరేషన్ థియేటర్కు స్ట్రెచర్లపై త్వరితగతిన తీసుకెళ్లడానికి లిఫ్ట్లు మొరాయించడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు  నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

లిఫ్ట్ ఘటన నేపథ్యంలో వన్ ఆస్పత్రికి షోకాస్ నోటీసు

కరీంనగర్, మే14 (విజయక్రాంతి): కరీంనగర్లోని వన్ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన లిఫ్ట్ ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు ఆస్పత్రిని సందర్శించిన వైద్యశాఖ అధికారులు ఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. లిఫ్ట్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, అత్యవసర సదుపాయాలు, నిర్వహణ రికార్డులపై ఆరా తీశారు. ది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్2010లోని సెక్షన్12 ప్రకారం  గురువారం జిల్లా వైద్యాధికారి కరీంనగర్లోని వన్ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి షోకాస్ నోటీసు జారీ చేశారు. పోలీస్  ఫైర్ డిపార్ట్మెంట్  అధికారులు  సైతం ఆసుపత్రి లొ  తనిఖీ లు  నిర్వహించారు .